కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు శుభవార్త చెప్పింది. జనవరి 1, 2021 నుంచి ఇతర నెట్వర్క్లకు కూడా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని జియో తాజాగా ప్రకటించింది. తొలినాళ్లలో డేటాకు మాత్రమే ఛార్జీ విధించి ఏ నెట్వర్క్కైనా వాయిస్ కాల్స్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చని ప్రకటించిన జియో కొన్నాళ్లకు ఆ సేవల్లో మార్పు చేసింది. జియో టూ జియో కాల్స్ మాత్రమే ఉచితంగా చేసుకోవచ్చని.. ఇతర నెట్వర్క్లకు కాల్స్ చేసుకోవాలంటే నిమిషానికి 6 పైసలు చెల్లించాలన్న షరతు విధించింది. కాల్స్ కోసం రూ.10 నుంచి టాపప్ ఓచర్లతో రీఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది.
అయితే.. ట్రాయ్ ఆదేశాల మేరకు ఇంటర్కనెక్ట్ యూసేజ్ ఛార్జ్లకు(ఐయూసీ) 2021, జనవరి 1 నుంచి స్వస్తి పలకనుండటంతో.. మళ్లీ తమ నెట్వర్క్ నుంచి ఇతర నెట్వర్క్లకూ ఉచిత కాల్స్ చేసుకోవచ్చని జియో తాజాగా స్పష్టం చేసింది. ఐయూసీ ఛార్జీలను తొలగించి బిల్ అండ్ కీప్ విధానాన్ని జనవరి 1, 2021 నుంచి అమలు చేయాలని ట్రాయ్ స్పష్టం చేసినట్లు జియో తెలిపింది.