దేశ చరిత్రలోనే తొలిసారిగా, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో నేటి నుండి అందుబాటులోకి రానున్న టీఎస్ బీ-పాస్ విధానం ఇక నుండి ఇంటి నిర్మాణ అనుమతులు పారదర్శకంగా, ఆన్లైన్ విధానంలో లభ్యం
- ఇక సులువుగా భవన నిర్మాణ అనుమతులు
- దరఖాస్తు చేసుకున్నాక 21 రోజుల్లోగా అనుమతి
- పేదలు, మధ్యతరగతి ప్రజలకు తప్పనున్న తిప్పలు
- దళారీ వ్యవస్థకు చెల్లుచీటీ.. మంత్రి కేటీఆర్ వెల్లడి
ఇది ఒక విప్లవాత్మక సంస్కరణ అని, కొత్త చట్టం హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు వర్తిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
75 గజాలు ఇంటి స్థలం ఉన్న పేదలు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అదేవిధంగా 75 గజాల నుంచి 600 గజాల వరకు ఇల్లు కట్టుకునే మధ్యతరగతి ప్రజలు తక్షణ అనుమతి తీసుకోవచ్చన్నారు. దీనివల్ల 85 శాతానికిపైగా దరఖాస్తులు త్వరగా పరిష్కారమవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ఒక వేళ 600 గజాలకుపైగా స్థలంలో కట్టే భవనానికి అనుమతి అవసరం ఉంటే, లేవుట్ అనుమతి అవసరం ఉన్నా టీఎస్ ఐపాస్ చట్టం మాదిరి 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఒకవేళ 21 రోజుల్లో అనుమతులు ఇవ్వకపోతే 22వ రోజు డీమ్డ్ అప్రూవల్ అనే విధానాన్ని తెస్తున్నట్టు తెలిపారు.
దరఖాస్తుల్లో లోపాలుంటే మొదటి పది రోజుల్లోనే ఆ దరఖాస్తులను తిరస్కరించే అధికారం మున్సిపాలిటీలకు ఉంటుందని స్పష్టంచేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా 15 రోజుల్లోనే ఇచ్చేలా చట్టంలో రూపకల్పన చేశామన్నారు. అంటే.. 75 గజాల స్థలం ఉంటే అనుమతులు అవసరం లేదని, కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే అవసరం ఉంటుందన్నారు. 75 నుంచి 600 గజాల వరకు ఉంటే తక్షణ అనుమతి, తక్షణ స్వీయ ధ్రువీకరణ పత్రం అవసరం ఉంటుందన్నారు.