బెల్లంపల్లి | 4 వ వార్డులో 20 ఏళ్లుగా భూ కబ్జా – అభివృద్ధికి అడ్డం – బస్తీ వాసుల అవస్థలు
Timeline

బెల్లంపల్లి | 4 వ వార్డులో 20 ఏళ్లుగా భూ కబ్జా – అభివృద్ధికి అడ్డం – బస్తీ వాసుల అవస్థలు

తెలంగాణ | మంచిర్యాల జిల్లా | బెల్లంపల్లి పట్టణం | గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక వెలుగు వెలిగిన బెల్లంపల్లి పట్టణం, ఇక్కడి సింగరేణి కార్మికులంతా వేరే చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఇప్పుడు ఇక్కడ జనాభా తగ్గింది. అయితే తెలంగాణ వచ్చిన తరువాత మంచిర్యాల జిల్లాగా ఏర్పడింది. దానితో బెల్లంపల్లికి కల వచ్చింది. అంతే కాకుండా బెల్లంపల్లి పట్టణంలో ఖాళీ స్థలంకు కొరత లేదు. అదే ఇప్పుడు కబ్జా రాయుళ్లకు వరంగా మారింది. అయితే ఈ కబ్జా రాయుళ్లు ఎవరో కాదు రాజకీయంగా పలుకుబడి ఉందంటూ ఇష్టం వచ్చినట్టుగా భూములు ఆక్రమించి , పేద వారి దగ్గర పైసలు వసూల్ చేసి వందల కొద్దీ ఇండ్లు కట్టించి ప్రభుత్వ భూములు కొల్లగొట్టి లక్షలు సంపాదించారు.

ఇక బెల్లంపల్లి లోని 4 వార్డులో అయితే , వార్డు ఊరికి చివరగా ఉండటంతో పోచమ్మ చెరువు నుండి మొదలుకొని బెల్లంపల్లి బస్తి వరకు ఉన్న ఖాళీ స్థలాలు ఇప్పటికే ఆక్రమణకు గురి అయ్యాయి. కాస్త లేటుగా మేల్కొన్న సింగరేణి అధికారులు మిగిలి ఉన్నా ఖాళీ స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా ఫెంచింగ్ వేశారు. అయితే గోల్ బంగ్లా బస్తి & బెల్లంపల్లి బస్తి లో పార్క్ కోసం కేటాయించిన స్థలం , మరియు బెల్లంపల్లి బస్తీలో వినాయక గుడి కోసం స్థానిక కౌన్సిలర్ కేటాయించిన స్థలాన్ని గేదెల కొట్టం పేరుతో 20 ఏళ్లుగా ఆక్రమిస్తూనే ఉన్నారు. అడిగే వారు లేరనే ధైర్యంతో బస్తి వాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో పట్టుదలతో మంచినీటి సరఫరా చేయాలనే ఉద్దేశంతో తలపెట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం కోసం పైప్ లైన్ కూడా వేయకుండా ఈ భూ కబ్జాదారులు అడ్డం పడుతున్నారు. ఆ పని కోసం వచ్చిన కాంట్రాక్టర్ ని భయపెట్టి వెళ్లగొట్టారు. అంతే కాకుండా వారి పశువులను ఇళ్లలోనే తిప్పుతూ.. పెంచుకున్న చెట్లను నాశనం చేస్తున్నారు. చుట్టూ ఉన్న పరిసరాలను అపరిశుభ్రంగా మార్చేస్తున్నారు. చడీ చప్పుడు లేకుండా భూ కబ్జా చేయడమే కాకుండా బస్తీ వాసుల అనారోగ్యానికి కూడా కారణం అవుతున్నారు. బస్తీ లోకి ఎవరైనా బంధువులు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉందని స్థానికులు వాపోతున్నారు.

బస్తీలో కూలి పని చేసే వారు కూడా క్రమం తప్పకుండా మున్సిపల్ వారికీ ఇంటి పన్ను కడుతున్నా , అక్రమంగా భూములు కబ్జా చేసి, 20 ఏళ్లుగా పన్ను కట్టకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారి చేతిలో మా బ్రతుకులు ఇలా నలిగిపోవడం ఏంటని బస్తీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు సింగరేణి కూడా బెల్లంపల్లి పట్టణం ను ప్రభుత్వ పరం చేసేసి రెవెన్యూ శాఖకు అప్పగించింది. ఇపుడు ఇదంతా రెవెన్యూ అధికారుల బాధ్యతే. భూకబ్జా దారులతో తలపడే ధైర్యం లేక ఇలా మీడియాతో మోర పెట్టుకుంటున్నారు బస్తీ వాసులు. స్థానిక కౌన్సిలర్ మరియు ఎమ్మెల్యే తమ గోడు విని తమకు న్యాయం చేయాలనీ బస్తీ వాసులు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు బస్తీలోకి వచ్చి ఆక్రమణకు గురి అయిన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని, బస్తీ వాసులకు కార్యక్రమాలు చేసుకోడానికి వినియోగించుకునేలా చేయాలనీ విన్నవించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *