ప్రసాదం పెట్టి పది మందిని హత్య చేశాడు

45

పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన పది హత్యలకు కారణం కేవలం డబ్బే అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. పది మంది ప్రాణాలు తీసిన సీరియల్ కిల్లర్ గురించి పోలీసులు వెల్లడించిన విషయాలు గగుర్పొడిచే విధంగా ఉన్నాయి. అశోక్ నగర్ కేపీడీటీ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడు నాగరాజు తొలుత గుండె పోటుతో మరణించాడని కుటుంబ సభ్యులు భావించారు. ఐతే అతని వద్ద ఉన్న డబ్బు బంగారం కనిపించకుండా పోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫ్యామిలీ మెంబర్స్. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమికంగా ఊహకే అందనంత ఘోరం ఏదో జరిగిపోయిందని మాత్రమే గుర్తించగలిగారు.

ఆ తర్వాత విచారణ వేగవంతం చేయటంతో అసలు నిజం బయటపడింది. మనుషులను చంపటంలో వెల్లంకి సింహాద్రి అలియాస్ శివది డిఫరెంట్ స్టైల్. ఆయుధం వాడకుండా చనిపోయే వాడికి కనీసం అనుమానం రాకుండానే లేపేస్తుంటాడు. దేవుడి ప్రసాదం అంటే తెలియని వారి నుంచైనా తీసుకుంటూ ఉంటారు జనం. అలాంటిది తెలిసిన వ్యక్తి ప్రసాదం ఇస్తే ఎందుకు కాదంటారు. ఇదే సింహాద్రికి బాగా కలిసి వచ్చింది. ప్రసాదంలో విషం పెట్టి చనిపోయే వాడికి సైతం తన ప్రాణం పోతోందని తెలియకుండా చంపేస్తాడు. ఇరవై నెలల్లో పది మందిని అత్యంత అమానుషంగా ఇలానే చంపేశాడు సింహాద్రి. పది హత్యలకు ప్రతిఫలంగా 30 లక్షలు పోగేసుకున్నాడు. ఈజీ మనీకి అలవాటు పడిని వెల్లింకి సింహాద్రి ఇరవై నెలల్లో పది మందిని ఎవ్వరికీ అనుమానం రాకుండా మట్టుపెట్టాడు. ఇరవై నెలల్లో ఇతగాడు చేసిన క్రైమ్ డేటా తెలిసి ఏకంగా పోలీసులే ఆశ్చర్యపోయారు.