ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా అప్పుడు ఆయన, ఇప్పుడు ఈయన

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు స్థానం ప్రత్యేకం. తెలుగు సినిమా రారాజు అయన. సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఎంతో మందికి అయన వెన్నంటే ఉండి ప్రోత్సాహం ఇచ్చారు. ఆనాటి దర్శకుల నుండి ఈ నాటి దర్శకుల వరకు, ఎవరి ఆశ అయినా, ఆశయం అయినా దాసరి లా సినిమా తీయాలి, పేరు సంపాదించాలనేదే.

అయితే ఇటు సినిమా దర్శకుడిగానే కాదు, సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు దాసరి. ఎవరికి ఏ అపాయం వచ్చిన, ఆపదలో ఉన్న క్షణాల్లో వారి ముందు ఉండేవారు. ఆకలితో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేసాడు, సినిమా రిలీజుల దగ్గర నుండి సినిమా లాసుల వరకు అన్ని కష్టాల్లో అందరి కష్టాల్లో అయన తోడుగా ఉన్నాడు. ఒక పెద్దన్న లా అందరిని అబిమానించాడు, ఆదుకున్నాడు.

కానీ ఆయన మరణంతో ఇండస్ట్రీ కుదేలైంది. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన ఆయన మరణించడంతో ఆ స్థానంలోకి ఎవరు వస్తారా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదిలింది. ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా.. అండగా నిలిచే దాసరికి బదులుగా ఇప్పుడు మనల్ని ఎవరు ఆదుకుంటారు అనే చర్చ మొదలయింది. కానీ ఆ చర్చ ఎక్కువ రోజులు జరగలేదు దానికి కారణం ఆ స్థానంలోకి మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారనే అభిప్రాయాలు వెలువడ్డాయి కాబట్టి.

ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలని పరిశీలిస్తే, చిరు నిజంగానే ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారిపోయారన తెలుస్తోంది. ఆయన ఎంత బిజీగా ఉంటున్నా సరే.. తనని కలవాలని వచ్చే ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు.. కొత్త కొత్త ఫిల్మ్ మేకర్స్ రూపొందిస్తోన్న సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు చిరు చేతుల మీదుగా జరుగుతున్నాయి.

ఇక ఈ మధ్యే అయన ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. యంగ్ హీరోలకు అయన ఇచ్చే ప్రశంసలు చెప్పక్కర్లేదు అవి ఎంతటి ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయో అని.

సాఫీగా సాగిపోతున్న సమయంలో ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా సినిమా ఇండస్ట్రీ పై కూడా పంజా విసిరిసింది. ఇటువంటి కష్ట కాలంలో కరోనా క్రైసిస్ చారిటీ పేరుతొ ఇండస్ట్రీలోని నిరు పేదలను ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చిరంజీవి. వెంటనే పెద్ద హృదయంతో ఇండస్ట్రీలోని పెద్ద చిన్న అందరు స్పందించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఇష్యు అయినా సరే చిరు లేనిదే ముందుకు కదలట్లేదు.

ఒక వైపు సినీ పెద్దలను కలవడం దగ్గరి నుండి, వారితో చర్చలు చేయడం నుండి, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలవడం వరకు అన్ని రకాలుగా ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు. ఇక ఇండస్ట్రీలో పెద్ద దిక్కు లేదనే బాధ ఎవరికి లేదని, ఆయనే పెద్దన్నగా అందరికి పెద్ద దిక్కు అయ్యారని ఈ పరిణామాలు సంకేతాలను ఇస్తున్నాయి.