ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వంద రోజుల పాలన తుగ్లక్-2.0లాగా ఉందని, ఈయన పాలనలో ధర్నా చౌక్ ఫుల్, అభివృద్ధినిల్, సంక్షేమం డల్‌గా మారిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
అమరావతిని ఎడారి చేశారని, పోలవరాన్ని మంగళవారంగా మార్చారన్నారు. 900 హామీలను నవరత్నాలంటూ కుదించారని విమర్శించారు. ఇంత చేసినా ఏమైనా సాధించారా అంటే అదీ లేదన్నారు.
ఉద్యోగులను రోడ్ల మీదకు ఈడ్చి ముఖ్యమంత్రి నివాసం దగ్గర 144 సెక్షన్ విధించారన్నారు. ప్రజలు, కార్మికులకు పని, తిండి లేకుండా చేసి ఈకెవైసి అంటూ క్యూలైన్లలో నిలబెట్టారని, ఈ మాత్రం దానికి వంద రోజుల పండుగ అంటూ సొంత డబ్బా కూడానా? అంటూ లోకేశ్ ప్రశ్నించారు.
సన్న బియ్యం అంటే సన్నగా ఉన్న వ్యక్తిని పౌరసరఫరాలశాఖ మంత్రిని చేయడం మాత్రమేనని ఆలస్యంగా అర్ధం చేసుకున్నామంటూ వ్యంగోక్తులు విసిరారు. సన్న బియ్యం సరఫరాచేసే సంచులకు వైసిపి రూ.750కోట్ల అవినీతికి పాల్పడిందని ట్వీట్ చేశారు.