బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ 2.0 ప్రభుత్వ 100 రోజుల పనితీరు అన్ని రంగాలలో అపూర్వం, చారిత్రాత్మకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. అన్ని రంగాలలో తాము వేగంగా పని చేస్తున్నామని చెప్పారు. అది జల్ జీవన్ మిషన్ అయినా, దేశంలోని ప్రతి ఒక్క రైతును గౌరవించడం, వారికి ఆర్థిక సహాయం, ముస్లిం మహిళలను ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి కల్పించడం, పిల్లల భద్రత బలోపేతానికి చట్టాలు చేసినట్లు మోడీ తెలిపారు.

గతం, వర్తమాన కలలు, ఆకాంక్షలను దేశం తప్పక నెరవేర్చాలని ప్రధాని స్పష్టం చేశారు. మన పిల్లలకు మెరుగైన, సంతోషకరమైన జీవితాన్ని అందించేలా భవిష్యత్ కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ప్రధాని అభిలాష వ్యక్తం చేశారు. మనం అలవాటు పడిన కష్టాలను భవిష్యత్ తరాలు అనుభవించకుండా చూసుకోవాలి, ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందితే దేశం పురోగతి సాధిస్తుందని మోడీ పేర్కొన్నారు.

ముంబయిలో రూ.20 వేల కోట్లకు పైగా నిధులతో చేపట్టిన ప్రధాన మెట్రో రైల్వే సంబంధిత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. ఈ లైన్లు పూర్తయితే ఇప్పటికే ఉన్న ముంబై మెట్రోకు అదనంగా మరో 42 కిలోమీటర్ల లైన్లు కలిసిరానున్నాయి. గైముఖ్ నుంచి శివాజీ చౌక్ వరకు 9.2 కిలోమీటర్లు, కల్యాణ్ నుంచి తలోజా వరకు 20.7 కిలోమీటర్లు, వాడాల నుంచి ఛత్రపతి శివాజీ టెర్మినస్ వరకు 12.8 కిలోమీటర్ల మేర మెట్రో లైన్లకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

దీంతో ముంబై వాసుల జీవితాలు సులభం కావడంతోపాటు, సమయం ఆదా అవుతుందని ప్రధాని చెప్పారు. దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతున్నప్పుడు, 21వ శతాబ్దంలో మన నగరాలు కూడా ఏక కాలంలో అడుగులు వేయడం అత్యవసరమని పేర్కొన్నారు. ఇందు కోసం వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం రూ.100 లక్షల కోట్లను కేటాయించనున్నట్లు మోడీ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings