భాజపా సీనియర్ నాయకులు, చంద్రబాబు కేబినెట్లో మంత్రి గా పనిచేసిన పైడికొండల మాణిక్యాలరావు మరణించారు. 28 రోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. కరోనా జయించి తిరిగొస్తారని అందరూ ఆశించారు. ఆయన కూడా కరోనా సోకాక వీడియో విడుదల చేశారు. కానీ 28 రోజులు పోరాడి కరోనాతో మరణించారు.
మాణిక్యాలరావు 20 రోజుల క్రితం ఏలూరు కొవిడ్ ఆస్పత్రిలో చేరారు. సీరియస్ అవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో వారం క్రితం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటి నుంచి వెంటిలేటరు మీదే ఉన్నారు. ఆరోగ్యం విషమించిండంతో శనివారం సాయంత్రం చనిపోయారు.
ఆయన మృతి అందరినీ కలిచివేసింది. సౌమ్యుడు, వివాద రహితుడు అయిన మాణిక్యాలరావు మరణంపై మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. స్వయంగా మాణిక్యాల రావు గారి సతీమణికి అయన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ లేఖ రాశారు.
మాణిక్యాల రావు గారు అందించిన సేవలను పార్టీ గుర్తుంచుకొని పార్టీ అభివృద్ధిలో వారు చేసినటువంటి కృషిని ప్రధానిగారు ఈరోజు లేఖ వ్రాసి వారి కుటుంబ సబ్యులకు నివాళి తెలుపడం జరిగింది.
ప్రధాని గారికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ నుండి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందని పార్టీ వైస్ ప్రెసిడెంట్ విష్ణు వర్ధన్ రెడ్డి గారు తెలియజేసారు.
