జమ్మూలో కొత్త పార్టీ షురూ ..
Timeline

జమ్మూలో కొత్త పార్టీ షురూ ..

మాజీ పిడిపి నేత, మాజీ మంత్రి అల్టాఫ్ బుఖారి ఆదివారం జమ్ము అండ్ కశ్మీర్‌అప్ని పార్టీ (జెకెఎపి)ని లాంఛనంగా ప్రారంభించారు. 60 ఏళ్ల బుఖారి వ్యవసాయ సైన్సు గ్రాడ్యుయేట్. నేషనల్ కాన్ఫరెన్సు, పిడిపి, కాంగ్రెస్, బిజెపి తదితర పార్టీల మాజీ ఎంఎల్‌ఎలు, సీనియర్ నాయకుల మద్దతుతో తన ఇంటి వద్దనే పార్టీ ఆవిర్భవాన్ని ప్రకటించారు. 

దాదాపు 40 మంది కొత్త పార్టీలో చేరారు. ఈ కొత్త పార్టీకి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పార్టీ సామాన్యుల కోసం, సామాన్యులు ఏర్పాటు చేసిన పార్టీగా అభివర్ణించారు.జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆరు నెలల తర్వాత జమ్మూకశ్మీర్‌లో కొత్త రాజకీయ శక్తి  అవతరించడం ఇదే మొదటిసారి.

1990 నుంచి జమ్ము కశ్మీర్ అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, 2019 ఆగస్టు 5 న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను రద్దు చేసిన తరువాత అనేక పరిణామాలు సంభవించాయని, కొత్త ప్రశ్నలు, కొత్త వాస్తవాలు తెరపైకి వచ్చాయని బుఖారి పేర్కొన్నారు. 

తమది  కుటుంబ పార్టీ కాదని, ఇది సామాన్యుల కోసం, సామాన్యుల చేత ఏర్పడిన పార్టీ అని తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎవరైనా సరే రెండు సార్లకు మించి అధ్యక్ష పదవిలో కొనసాగరాదని స్పష్టం చేశారు. 

జమ్ము కశ్మీర్ ప్రజల ఆత్మగౌరవం, ప్రతిష్ట తిరిగి ఇనుమడింప చేసేందుకు కొత్త పార్టీ కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఉద్యోగాల్లో, చదువుల్లో ప్రజల స్థానిక హక్కులను తిరిగి సాధించుకునేలా పాటుపడతానని ఆయన చెప్పారు.

  పూర్తి ఆశావహ దృక్పథం, నిజాయితీ, నిష్పాక్షికతతో పార్టీ ఏర్పాటు చేశామని, ఈ రాజకీయ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములేనని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ ఎన్నో త్యాగాలు చేసిందని, ప్రజల కలలు సాకారం చేసేందుకు పార్టీ కృషిచేస్తుందని బుఖారి చెప్పారు.  

Leave a Reply

Your email address will not be published.