రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాత్రికి రాత్రి ఉత్తర్వులను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం రమేష్‌కుమార్‌ను కమిషనర్‌గా పునర్నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఉపసంహరించుకున్న కొన్ని గంటల వ్యవధిలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
సీనియర్ ఐఎఎస్ అధికారిణి జీ వాణి మోహన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వాణీమోహన్ సహకార శాఖ కమిషనర్‌గా, పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైెరెక్టర్‌గా పని చేస్తున్నారు. 1996 బ్యాచ్ ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారిణి ఆమె. ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా వాణీ మోహన్ సోమవారం బాధ్యతలను స్వీకరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.