కరోనా: హైదరాబాద్ లో పాజిటివ్ వచ్చిన 2200 మంది మిస్సింగ్
Timeline

కరోనా: హైదరాబాద్ లో పాజిటివ్ వచ్చిన 2200 మంది మిస్సింగ్

కోవిడ్-19 పేషెంట్లకు ప్రభుత్వం హోం ఐసోలేషన్ కిట్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇంట్లో ఉండి కరోనా చికిత్స పొందుతున్న వారి వివరాలను జీహెచ్ఎంసీ అధికారులు ఆరా తీయగా.. వందలాది మంది వివరాలు సరిగా లేవని గుర్తించారు. కరోనా వచ్చిన వారి పట్ల సమాజంలో ఉన్న అపోహలే దీనికి కారణమని భావిస్తున్నారు. ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకోవడం.. ఆధార్ కార్డులో ఉన్న శాశ్వత చిరునామా ఉండగా.. ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతం వివరాలు తెలియకపోవడంతో కరోనా బాధితులను గుర్తించడం కష్టంగా మారుతోంది.

గత రెండు వారాలుగా హైదరాబాద్‌లో 2200 మందికిపైగా కరోనా పేషెంట్లు మిస్సయ్యారని జీహెచ్ఎంసీ అధికారులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. వీరంతా తప్పుడు ఫోన్ నంబర్లు, అడ్రస్‌ ఇచ్చారని అధికారులు తెలిపారు.

‘‘హోం ఐసోలేషన్ కిట్లను అందించడం కోసం బాధితుల వివరాలను ఆరా తీస్తుంటే.. రోజూ డజన్ల సంఖ్యలో బాధితుల వివరాలను మా సిబ్బంది గుర్తించలేకపోతున్నారు’’ అని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ (హెల్త్) బదావత్ సంతోష్ తెలిపారు.

ఇలా మిస్సయిన వారు ముందుకొచ్చి అధికారులకు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తప్పుడు వివరాలు ఇచ్చిన కరోనా బాధితులను కోరారు. కరోనా సోకిన వారు రోడ్ల మీద తిరిగితే వారి వల్ల ఇతరులకు ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు మరింత బాధ్యతయుతంగా ఉండాలని లోకేశ్ కుమార్ హితవు పలికారు.

కొందరికి కరోనా పాజిటివ్ అని తేలగానే ఫోన్లు స్విచ్ఛాఫ్ చేస్తున్నారని… అధికారులకు దొరకకుండా తప్పుడు అడ్రసులు ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. గ్రూపుగా వచ్చిన 10 మంది వ్యక్తులు ఒకే ఫోన్ నంబర్ ఇచ్చారని.. ఆ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉందని తెలిపారు.

ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఆధారంగా కొందర్ని వెతికి పట్టుకునే ప్రయత్నం చేయగా.. చాలా మంది ఐసోలేషన్ కిట్లు తీసుకోవడం లేదని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ‘మా ఇంటికి దూరంగా ఉన్న స్నేహితులకు లేదా బంధువులకు ఆ కిట్లు ఇవ్వాలని కరోనా పాజిటివ్‌గా తేలినవారు కోరుతున్నార’ని అధికారి చెప్పడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published.