ఫ్రాడ్: కోటి రూపాయల జీతం, ఒకేసారి 25 స్కూళ్లలో ఆవిడే టీచర్

ఉత్తర ప్రదేశ్‌లోని రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి) లో పనిచేస్తున్న ఒక టీచర్ ఒకేసారి 25 పాఠశాలల్లో పనిచేసింది.  ఉపాధ్యాయుల విభాగం డేటాబేస్ తయారుచేయడం ప్రారంభించిన తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆ టీచర్ పై దర్యాప్తునకు ఆదేశించారు.

ప్రాథమిక విద్యా విభాగం చెప్పిన వివరాల ప్రకారం, ఉపాధ్యాయుల డిజిటల్ డేటాబేస్ తయారుచేస్తున్నామని, ఈ ప్రక్రియలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర జిల్లాల్లోని 25 వేర్వేరు పాఠశాలల్లో ఒకే టీచర్ నియమించినట్లు బయటపడిందని చెప్పారు.

కెజిబివిలో ఫుల్ టైం టీచర్ గా పనిచేస్తున్న అనామిక శుక్లా 25 పాఠశాలల్లో ఒకేసారి ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు. ఆమె అమేథి, అంబేద్కర్నగర్, రాబరేలి, ప్రయాగ్రాజ్, అలీగర్ మరియు ఇతర జిల్లాల్లో ఉపాధ్యాయురాలిగా నమోదు చేయబడింది.

డిజిటల్ డేటాబేస్ ఉన్నప్పటికీ, ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 13 నెలలకు పైగా ఆమె డిపార్ట్మెంట్ నుండి సుమారు 1 కోట్ల రూపాయల వేతనాన్ని పొందగలిగింది.

డిపార్ట్‌మెంట్‌లో లభ్యమయ్యే రికార్డుల ప్రకారం అనామిక శుక్లా మెయిన్‌పురి జిల్లాకు చెందినది. డిపార్ట్మెంట్ కూడా నిందితురాలు అయిన టీచర్ శుక్లాకి నోటీసు పంపినప్పటికీ ఆమె నుండి ఎటువంటి స్పందన రాలేదు.

వివిధ పాఠశాలల నుండి జీతాల బదిలీకి ఒకే బ్యాంకు ఖాతా ఉపయోగించబడిందా అని తెలుసుకోవడానికి విద్యా శాఖ ప్రయత్నిస్తుంది. ఆమె జీతం కూడా తక్షణమే నిలిపివేయబడింది.

ఇండియా టుడే టివితో యుపి ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సతీష్ ద్వివేది మాట్లాడుతూ, “ఆరోపణలు నిజమైతే ఉపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిపార్ట్మెంట్ ఆదేశించింది. మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పారదర్శకత కోసం డిజిటల్ డేటాబేస్ తయారుచేస్తున్నాం. ఇందులో కనుక డిపార్ట్మెంట్ అధికారుల ప్రమేయం ఉంటే చర్యలు తీసుకుంటాం. కాంట్రాక్టు ప్రాతిపదికన కెజిబివి పాఠశాలల్లో కూడా హైరింగ్స్ జరుగుతాయి. ఈ కేసు గురించి పూర్తి నిజాలు త్వరలోనే విద్య శాఖ విభాగం తెలియజేస్తుంది అని చెప్పారు.