దారుణం: యువతిపై మగ మృగం దాడి..
Timeline

దారుణం: యువతిపై మగ మృగం దాడి..

రోజురోజుకి జన జీవనంలోకి క్రూర మృగాల అరాచకాలు హద్దు అదుపు లేకుండా పోతున్నాయి. కానీ ఈ మృగాలు అడవుల్లో పుట్టినవి కావు. మన మధ్యనే మనుషుల్లానే పుట్టి క్రూర మృగాళ్లలా ప్రవర్తిస్తున్నాయి. అడ బిడ్డ రోడ్డు మీద కనిపిస్తే చాలు విరుచుకుపడుతున్నారు. విచక్షణ కోల్పోతున్నారు. ప్రేమ పేరుతొ నరకం చూపిస్తున్నారు. ప్రేమించకపోతే చంపేస్తున్నారు.

ఇలాంటి సంఘటనే ఖమ్మం జిలాల్లోని ఇల్లెందు పట్టణంలో చోటు చేసుకుంది. ఇల్లెందు పట్టణానికి చెందిన సందీప్‌, సౌజన్య గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. కాగా, ఈ విషయమై మాట్లాడుకుందామంటూ గురువారం రాత్రి యువతిని శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లిన సందీప్‌ ఆమెపై కత్తితో దాడి చేశాడు. అనంతరం యువకుడు అక్కడి నుంచి వస్తుండగా పెట్రోలింగ్‌ చేస్తోన్న పోలీసులకు రక్తపు మరకలతో కనిపించాడు. అనుమానంతో సీఐ రమేశ్‌ యువకుడిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.

యువతిపై దాడి చేసినట్లు  పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు అపస్మారక స్థితిలో పడి ఉన్న యువతిని ఇల్లెందు వైద్యశాలకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం  ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.