ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు కానీ, ఏపీలో మాత్రం రెండున్నరేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. వివిధ కారణాలతో పంచాయతీల పాలకవర్గాలు లేకుండా సాగిపోయిన ఆంధ్రప్రదేశ్ లో విభజనానంతరం తొలి ఎన్నికలకు ఇప్పుడు రంగం సిద్ధమయ్యింది.
అయితే ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల పర్వం ముగిసింది. తొలి విడతలో 168 మండలాల్లోని 3వేల 249 పంచాయతీలు, 32 వేల 504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మూడురోజుల పాటు జరిగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో మొదటిరోజు 1,317 పంచాయతీలు, 2,200 వార్డులకు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోరోజు 7వేల 460 పంచాయతీలు, 23 వేల 318 వార్డులకు నామినేషన్లు రాగా.. ఆఖరిరోజు మాత్రం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఫిబ్రవరి 4 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా.. ఫిబ్రవరి 9న తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్, అదేరోజు ఫలితాలు వెలువడనున్నాయి.
రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవాలపై పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ‘పంచాయతీ ఎన్నికలు గేమ్ ఛేంజర్స్ ఎలక్షన్స్’ అని అభివర్ణించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాలను తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం టీడీపీ బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని చంద్రబాబు తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో ఏక గ్రీవాలు ఇప్పుడు రాజకీయ రచ్చగా మారాయి. ఏకగ్రీవాలపై మొగ్గు చూపుతున్న వైసీపీ పార్టీకి SEC నిమ్మగడ్డ వ్యాఖ్యలు ఇప్పుడు మింగుడు పడటం లేదు. అధికారంలో ఉన్న పార్టీకి మామూలుగానే స్థానిక ఎన్నికల్లో ఏక గ్రీవాలు రావడం మామూలు విషయమే. నిమ్మగడ్డ ఈ ఎన్నికలను సవాలుగా తీసుకోవడం, టీడీపీకి మద్దతుగా ఆయన వ్యవహరిస్తున్నారని, వైసీపీ ని టార్గెట్ చేస్తారని ఆ పార్టీ నేతలు మీడియా తో చెప్పడం, ఇవి మాత్రమే వైసీపీకి తలనొప్పిగా మారిందనుకుంటే పొరపాటే. ఇప్పుడు వైసీపీ మెడకు మరొక సమస్య వచ్చి పడింది ఈ స్థానిక ఎన్నికల్లో.
చాలా గ్రామాల్లో అధికార పార్టీని ఏక గ్రీవం చేయడం వరకు సంతోషకర విషయమే ఆ పార్టీకి కానీ అసలు తలనొప్పి వచ్చిందల్లా వైసీపీ నేతలకు తమ పార్టీ నేతలే ప్రత్యర్థులై తలనొప్పిగా మారుతున్నారు. ఒకే గ్రామం నుండి ఇద్దరు లేదా ముగ్గురు వైసీపీ పేరు చెప్పుకొని నామినేషన్లు వేయడం, ప్రచారాలు చేయడం .. ఇదంతా ప్రతిపక్ష పార్టీ టీడీపీ కి లాభం చేకూర్చేలా ఉందని ఆ నేతల్లో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. మరోవైపు కొందరు టీడీపీ నేతలు కూడా సడెన్ గా వైసీపీ తీర్థం పుచ్చుకోవడం , ఎప్పటినుండో వైసీపీ జెండా మోసిన వారికి పార్టీ నుండి సపోర్ట్ లేకపోవడం ఇవన్నీ ఇప్పుడు పెద్ద సమస్యగానే మారింది. దీనిపై పార్టీలోని పెద్ద నేతలు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. వారు ఎంత త్వరగా మేల్కొని నిర్ణయాలు తీసుకుంటే ఆ పార్టీకి అంత తక్కువ నష్టం అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నా మాట.