టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపుగా ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా కరోనా కారణంగా మిగతా షూటింగ్ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను మళ్లీ మొదలు పెట్టినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఏడు నెలల విరామం తరువాత హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన సెట్‌లో షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టినట్టు స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.
అయితే సెట్ గేట్లు తెరిచిన దగ్గర నుంచి పరిసరాలు క్లీనింగ్ చేయడం, నటీ నటులు ధరించే వస్త్రాలను ఇస్త్రీ చేయడం, సినిమాలో వాడే ఆయుధాలను మరియు వాహనాలను శుభ్రపరచడం, లైటింగ్, కెమెరా, యాక్షన్ వరకు అన్నిటిని రాజమౌళి లెవల్‌కి తగ్గట్టుగానే అందులో చూపించి అభిమానులలో మరింత జోష్ నింపాడు. అయితే ఇదే కాకుండా ఈ నెల 22న కొమరం భీమ్‌గా తారక్ లుక్‌ను కూడా రిలీజ్ చేయబోతున్నామని “రామరాజు ఫర్ భీమ్” కోసం ఎదురుచూడమని చిత్ర బృందం ప్రకటించింది.