ఇంటిని, ఆఫీస్ ని హాయిగా జయించండి

చాలా మంది మహిళలు ఇంటిపని, ఆఫీస్ పని రెండింటిని సమన్వయం చేసుకోలేక ఒత్తిడికి లోనవుతుంటారు. ఆఫీస్‌లో చక్కని వాతావరణం ఉంటే ఇంటిపని కూడా సక్రమంగా చేసుకోగలరని నిపుణులంటున్నారు.
రోజు ఆఫీస్‌కు వెళ్లగానే టీం సభ్యులందరితో కూర్చొని ఆ రోజు చేయాల్సిన పని సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి. తరువాత పనులను విభజించుకోవాలి. దీని వలన పని భారం తగ్గుతుంది.
నిర్విరామంగా పనిచేయకుండా మధ్యమధ్యలో సహోద్యోగులతో మాట్లాడుతూ హాస్యం వేసుకోవడం, ఇతర అంశాలపై చర్చించుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు.


నెలలో చేయవలసిన పనులు, లక్ష్యాలను ముందుగానే రాసిపెట్టుకోవాలి. అలాగే సహోద్యోగుల పుట్టినరోజులు, పెళ్లి రోజులు.. ఇలా ఏదో ఒక సందర్భంలో వేడుకలు చేసుకోవాలి. ఇలాంటి వాటి వలన టీం సభ్యుల మధ్య మంచి అనుబంధాలు ఏర్పడుతాయి. ఒకరిపై ఒకరికి అవగాహన కలుగుతుంది.

ఏదైనా సమస్య వచ్చినప్పుడు తోటి వారితో చర్చించి.. సమస్యకు ఉన్న అన్ని కోణాలు పరిశీలించుకుంటే పరిష్కార మార్గాలు సులభంగా దొరుకుతాయి.పడుకునే ముందు చల్లని నీటి స్నానం చేసి.. మీ నచ్చిన పుస్తకం చదువుతూ లేదా మీ ఇష్టమైన పాటలు వింటూ పడుకోవడం వలన కూడా ఒత్తిడిని అధిగమించవచ్చు. మరునాడు హాయిగా ఆఫీస్‌కు వెళ్లవచ్చు.

తోటి ఉద్యోగస్తులకు, స్నేహితులకు సహాయం చేసే స్వభావాన్ని పెంపొందించుకోండి. వారిని ఆందోళనకు గురిచేసే సందర్భాలు, సమస్యలు వచ్చినప్పుడు మీరు కనీసం మాట సహాయం అయినా కొంత ఉపశమనం ఇచ్చిందన్న నమ్మకాన్ని వారికి కలుగజేయాలి. ఉద్యోగ జీవితానికి, కుటుంబ జీవితానికి స్పష్టమైన విభజన రేఖ గీసుకోండి. మీరు చేసే పనికి పూర్తి సమయం కేటాయించడం వలన కుటుంబ జీవితం దెబ్బతినడమే కాకుండా ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని సాధించాలి.

పనిలో పడి రోజు వారి పనులు మరచిపోకుండా ఫోన్‌లో రిమైండర్‌ను పెట్టుకోండి లేదా తరచూ మీ దృష్టి ఉండే ప్రదేశంలో విషయాలు కాగితంపై రాసి అతికించండి. ఏదైన పని చేసినప్పుడు వచ్చే పొగడ్తలు ఎలా స్వీకరిస్తామో… విమర్శలు కూడా అలానే స్వీకరించాలి. వాటిని సమన్వయం చేసుకున్నప్పుడే పని ఒత్తిడిని అధిగమించగలం. లేకపోతే ఆ ఆలోచనలు మీలో ఒత్తిడిని పెంచి చేస్తున్న పనిని సాఫీగా చేయనివ్వవు.