వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కాదు ‘మోడీ ఆరోగ్య శ్రీ’

26

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజార్టీ ఇస్తే ఏపీలో  అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి  సురేష్ ప్రభు చెప్పారు. గత అయిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువే సాయం చేసిందని, భవిష్యత్‌లో మరింత చేయూతనందిస్తామని విశాఖపట్నంలో వెల్లడించారు. 

తాను ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిద్యం వహిస్తున్నానని, ఏపీకి ఏం చేయాలో తనకు తెలుసని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ స్వయంగానే ఎదుగుతుందని, ఎవరితోనూ పొత్తు అవసరం రాదని, అటువంటి అలోచనేదీ ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు. 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉంటే ఏ మేరకు అభివృద్ధి చెందుతుందో అంతుకు మించి కేంద్రం ఏపీని ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. విభజన హామీలన్నింటినీ అమలు చేయడమే కాకుండా, చట్టంలో పేర్కొన్నవాటి కంటే ఎక్కువగానే కేంద్రం పలు జాతీయ సంస్థలను ప్రకటించిందని గుర్తు చేశారు. నవ్యాంధ్రకు దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఇప్పటికే ప్రయటించారని, అయితే వాల్తేరు డివిజన్ విషయంలో నెలకొన్న అనుమానాలు త్వరలోనే తొలుగుతాయని చెప్పారు. 

గత అయిదేళ్లలో రైల్వే పరంగా ఏపీకి మూడు రెట్లు అధికంగా నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేశామని ప్రకటించారు. దేశ వ్యాప్తం గా ప్రధాని మోదీ నేతృత్వంలో అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కోట్లాది మందికి కార్పొరేట్ వైద్య సేవలందుతున్నాయని తెలిపారు. అయిదు లక్షల రూపాయల వరకూ ఆయుష్మాన్ భారత్‌లో నిరుపేదలకు వైద్య సాయం అందిస్తున్నామని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పథకంగా పేర్కొన్నారు. 

రాష్ట్రంలో అమలు చేస్తున్న వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కేంద్ర పథకమేనని, అయితే పేరుమార్చి అమలు చేస్తున్నారని చెప్పారు. ఇక ముద్ర యోజన, కిసాన్ సమ్మాన్, ఉజ్వ ల యోజన వంటి పథకాలన్నీ కేంద్ర నిధులతో అమలవుతున్నవేనని వివరించారు. దేశం అంతటా ఒకే చట్టం, ఒకే రాజ్యాంగం ఉండాలని భావించి కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని మోదీ సర్కారు రద్దు చేసిందని పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ రద్దుతో ఒకే దేశం, ఒకే జెండా నినాదాన్ని చేసి చూపించామని చెప్పారు.