Breaking News :

‘సైరా నరసింహారెడ్డి’ రివ్యూ

దాదాపు 12 ఏళ్ల నుండి మెగాస్టార్ చిరంజీవి కల స్వతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని తెరకెక్కించాలని. అయితే ఇన్నేళ్ల తర్వాత రామ్ చరణ్ ద్వారా తన కలను తీర్చుకున్నాడు. సైరా నరసింహారెడ్డి పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 5 భాషల్లో విడుదలైంది. మరి ఈ భారీ పీరియాడిక్ డ్రామా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డంతో చ‌ర‌ణ్ అన్ కాంప్ర‌మైజ్‌డ్‌గా ఈ సినిమాను నిర్మించారు. ప్యాన్ ఇండియా సినిమాగా చేయాల‌నే ఉద్దేశంతో అమితాబ్‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చాసుదీప్‌, న‌య‌న‌తార‌, అనుష్క‌, త‌మ‌న్నా, జ‌గ‌ప‌తిబాబు ఇలా భారీ తారాగ‌ణంతో సినిమాను నిర్మించారు. మ‌రో ప‌క్క ఉయ్యాల‌వాడ వంశీకుల నుండి చిన్న వివాదం కూడా నెల‌కొంది. ఆందోళ‌న‌లు, కోర్టులు, కేసులంటూ న‌డిచాయి. ఎట్ట‌కేల‌కు అన్నీ స‌మ‌స్య‌ల‌ను దాటి ముందుకు వ‌చ్చిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌గాథ సైరా న‌రసింహారెడ్డి ప్రేక్ష‌కుల‌ను ఏ మేర మెప్పించిందో తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం..

కథ:

దత్త మండలాలతో కూడిన రేనాడు ప్రాంతాన్ని 61మంది పాలెగాళ్లు చిన్న చిన్న సంస్థానాలుగా చేసుకుని పరిపాలన సాగిస్తుంటారు. అయితే, ఎవరి మధ్యా ఐకమత్యం ఉండదు. ఒకరంటే ఒకరికి పడదు. రేనాడుపై పన్ను వసూలు చేసుకునే హక్కు ఆంగ్లేయులు పొందడంతో ఎవరికీ స్వయం పాలన ఉండదు. మరోవైపు వర్షాలు లేక, పంటలు పండక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.

పంటలు పండకపోయినా పన్నులు కట్టాలని ప్రజలను ఆంగ్లేయులు హింసిస్తుంటారు. అలాంటి సమయంలో మజ్జారి నరసింహారెడ్డి (చిరంజీవి) అనే పాలెగాడు ఆంగ్లేయులపై ఎలా పోరాటం చేశాడు? ఐకమత్యం కొరవడిన 61మంది పాలెగాళ్లను ఎలా ఏకతాటిపైకి తీసుకొచ్చాడు? వీరారెడ్డి (జగపతిబాబు), అవుకు రాజు (సుదీప్), పాండిరాజా (విజయ్ సేతుపతి), లక్ష్మి (తమన్నా)లు తొలి స్వాతంత్ర పోరాటంలో నరసింహారెడ్డికి ఎలా సహకరించారు? చివరకు నరసింహారెడ్డి పోరాటం ప్రజల్లో స్వాతంత్ర్యకాంక్షను రగిలించిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

నటీనటులు:

మెగాస్టార్ చిరంజీవి కన్న కల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని తెరకెక్కించడం. అయితే 60 ఏళ్లకు పైబడ్డ చిరంజీవి ఎంత కష్టపడినా, ఎంత తన నటనతో మైమరపించినా తన వయసు కనిపిస్తూనే ఉంది. ఏదేమైనా చిరంజీవి కమిట్మెంట్ ను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. ఈ వయసులో కూడా ఆయన కష్టపడిన తీరు తెరపై కనువిందు చేస్తుంది. నయనతార, చిరంజీవి భార్యగా సిద్ధమ్మ పాత్రలో హానెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. తమన్నా కూడా మెప్పిస్తుంది. ఇక ఒక్కో భాష నుండి ఎంపిక చేసుకున్న లెజండ్స్ అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు.. ఇలా ఎవరికి వారు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మిగతావారంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

చివరిగా:

ఒక స్ఫూర్తిమంతుడైన స్వతంత్ర పోరాట యోధుని కథను మన ప్రేక్షకులకు నచ్చే విధంగా మలచడంలో సైరా టీమ్ సక్సెస్ అయింది. అయితే చరిత్రను మరీ ఎక్కువగా మార్చేసారా అనిపిస్తుంది. ఏదేమైనా సైరా మొదలుకావడం కొంచెం స్లోగా ఉన్నా, కొంచెం పేస్ అందుకున్నాక ఇక ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో పూర్తిగా సక్సెస్ అయింది. ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాకు పెర్ఫెక్ట్ ముగింపునిచ్చింది.

మొత్తంగా సైరా ఈ దసరాకు తప్పక చూడాల్సిన చిత్రం.

రేటింగ్స్ 3.5

Read Previous

మహాత్ముడికి నివాళులర్పించిన ప్రధాని

Read Next

ఏపీ అప్పులపై ఆర్బీఐ షాకింగ్ న్యూస్