వీడియో: బస్సు చక్రాల కింద నలిగి TCS లో పనిచేస్తున్న యువతి మృతి

39

బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్ 12లో ఆర్టీసీ బస్సు బీభత్సం చేసింది. స్కూటీపై వెళ్తున్న ఓ యువతిని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. మహిళ తల పైనుంచి బస్సు చక్రం వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ప్రమాదంలో ఆమె తల నుజ్జనుజ్జయింది. తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతి చెందిన యువతిని టీసీఎస్ ఉద్యోగిని సోహిని సక్సేనా (26)గా గుర్తించారు. సోహిని మంగళవారం (నవంబర్ 26) మధ్యాహ్నం తన ద్విచక్రవాహనంపై మాసబ్ ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి కారణమైన తాత్కాలిక డ్రైవర్‌ను స్థానికులు, వాహనదారులు పట్టుకొని దాడి చేశారు. దుస్తులు విప్పి చితకబాదారు. ఆగ్రహంతో ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. మృతదేహం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రమాదంతో మాసాబ్ ట్యాంక్ – పంజాగుట్ట, మెహిదీపట్నం మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.