కేసీఆర్ బంధువు కిడ్నాప్ కేసులో టీడీపీ నేత భూమా అఖిల ప్రియ
Timeline

కేసీఆర్ బంధువు కిడ్నాప్ కేసులో టీడీపీ నేత భూమా అఖిల ప్రియ

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లిలోని నివాసంలో ఆమెతోపాటు బంధువులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.బేగంపేటలోని లెర్నింగ్‌ సెంటర్‌కు అఖిలప్రియను తీసుకెళ్లి పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

బోయిన్‌పల్లిలో చోటుచేసుకున్న కిడ్నాప్‌ కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే అఖిల ప్రియ భర్త భార్గవరామ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

బోయిన్‌పల్లిలో నిన్న రాత్రి బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల అపహరణ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురి కిడ్నాప్‌ వ్యవహారంలో అఖిలప్రియ దంపతుల ప్రమేయంపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఓ భూవివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావు కుటుంబానికి, భూమా అఖిల ప్రియ కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి మనోవికాస్‌ నగర్‌లోని తమ స్వగృహంలో ఉన్న ప్రవీణ్‌రావు, ఆయన సోదరులు సునీల్‌రావు, నవీన్‌రావును మంగళవారం రాత్రి 7.20 గంటల సమయంలో సినీ ఫక్కీలో దుండగులు అపహరించారు. మూడు కార్లలో వారి ఇంటికి వెళ్లిన దుండగులు ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ముగ్గురు సోదరులను బెదిరించి వారితో పాటు ల్యాప్‌టాప్‌, చరవాణిలను కూడా పట్టుకుపోయారు. ఆ ముగ్గురు కిడ్నాప్‌నకు గురైనట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు.  బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ ముగ్గురిని వికారాబాద్‌లో గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *