రాజధాని ప్రాంతంలో తాడికొండ వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించి, దాడికి దిగిన టీడీపీ నేతల ఉదంతం కలకలం రేపింది.

సోమవారం వైఎస్సార్‌ వర్థంతి సందర్భంగా శ్రీదేవి తుళ్లూరు మండల పరిధిలోని అనంతవరం గ్రామానికి వెళ్లారు. అక్కడ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షుడు పోలు రమేశ్‌ ఆహ్వానం మేరకు వినాయకుడి విగ్రహం వద్దకు కుటుంబంతో కలిసి వెళ్లి పూజ చేస్తుండగా టీడీపీ నేత కొమ్మినేని శివయ్యతోపాటు మరికొందరు పెద్దగా అరుస్తూ.. దళిత మహిళ పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని, పూజ చేయొద్దని ఆమె వైపునకు దూసుకెళ్లారు. అంతటితో ఆగకుండా తీవ్ర పదజాలంతో కులం పేరుతో ఆమెను దూషించారు.

ఇదేమిటని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడటమే కాకుండా అడ్డుకోబోయిన పోలీసులను సైతం నెట్టిపడేశారు. తనను దారుణమైన పదజాలంతో దూషించడంతో ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్ర మనస్తాపానికి లోనై కంటతడి పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

దీనిపై తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ వట్టికూటి గౌతమి కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం నిందితుల్లో కొమ్మినేని శివయ్య, ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకుని వారిని తుళ్లూరు డీఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరో ఇద్దరు కొమ్మినేని రామకృష్ణ, బుజ్జి పరారీలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings