తెలంగాణ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ ఆపేయండి… హైకోర్టు తీర్పు
Timeline

తెలంగాణ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ ఆపేయండి… హైకోర్టు తీర్పు

నేటి నుంచి జరగాల్సిన రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ఆపి వేయాలంటూ తెలంగాణ హైకోర్టు జేఎన్‌టీయూకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించి పరీక్షలు రాయలేకపోయిన, పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించలేక పోయిన విద్యార్థులకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించలేదు. అలాంటి విద్యార్థులకు 35 శాతం మార్కులు వచ్చినట్లుగా పరిగణించి పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఎంసెట్‌ నిబంధనలకు అనుగుణంగా వారికి 45 శాతం మార్కులు వేయలేదు. దీంతో వారంతా కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కోల్పోయారు. దీనితో తమకు అన్యాయం జరిగిందని వారంతా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన హై కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం జస్టిస్‌ పి.నవీన్‌రావు ఈ పిటీషన్ ను విచారించారు.

అయితే విచరాణ సందర్భంగా.. పిటీషన్ దాఖలు చేసిన విద్యార్థుల మాదిరిగా 35 శాతం మార్కులు వచ్చిన వారిని సైతం రెండో విడత కౌన్సెలింగ్ కు అనుమతించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసే వరకు కౌన్సెలింగ్‌ వాయిదా వేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఎంసెట్‌ పరీక్షను నిర్వహిస్తున్న జేఎన్‌టీయూకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది

ఇదిలా ఉంటే.. 40/45 శాతం మార్కులు వస్తేనే ఎంసెట్ కౌన్సెలింగ్ కు హాజరు కావాలన్న నిబంధనను సవరిస్తామని ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్ కోర్టకు హామీ ఇచ్చారు. దీంతీ ఈ అంశాన్ని కోర్టు తన రికార్డుల్లో నమోదు చేసింది. గత నిబంధనను మార్చి 35 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులను సైతం కౌన్సెలింగ్ కు అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎంసెట్‌ నిబంధనలు సడలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేరకు రెండు రోజుల్లో జీవో జారీ చేయనున్నట్లు ఏజీ చెప్పారు. ఈ అంశంపై స్పందించిన న్యాయమూర్తి.. జీవో జారీ అయ్యే వరకు సెకండ్ ఫేజ్ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిలిపివేయాలని ఆదేశాలు ఇస్తూ విచారణను వాయిదా వేశారు.