దేశవ్యాప్తంగా మాంసాహారులు 61.86 శాతం.. తెలంగాణలో ఏకంగా 98.73 శాతం

20

భారతదేశం ప్రధానంగా శాకాహార దేశమా, మాంసాహార దేశమా? దీనిపై గతంలో ఎన్నో చర్చలు జరిగాయి. జరుగుతున్నాయి. జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ విషయంపై నిర్వహించిన ఒక పరిశోధన లేటెస్ట్‌గా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దేశంలో మాంసాహారం తినేవాళ్లలో తెలంగాణనే టాప్‌లో ఉందట. అవును ఇదే నిజం.

దేశవ్యాప్తంగా మాంసాహారులు 61.86 శాతం మంది ఉంటే తెలంగాణలో ఏకంగా 98.73 శాతం మంది నాన్ వెజ్ తింటున్నారట. దేశంలో తినే మొత్తం మాంసంలో 60 శాతం తెలుగు రాష్ట్రాల్లో ఆహారంగా తీసుకుంటున్నారని జాతీయ మాంస పరిశోధన సంస్థ (ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌సీఎం) స్పష్టం చేసింది. ఇక మటన్‌కు తెలంగాణ రాష్ట్రంలో భారీగా డిమాండ్ ఉందని చెబుతున్నాయి అధ్యయనాలు.

వాస్తవానికి ఒక్కో వ్యక్తి ఏడాదికి 12కిలోల మాంసాన్ని తినాలని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్‌‌‌‌ఐఎన్‌‌) చెబుతుంది. అయితే జాతీయ స్థాయిలో తలసరి వినియోగం 2 కిలోల 900 గ్రాముల నుంచి 3 కిలోల 260 గ్రాములు వరకు ఉంటోంది. తెలంగాణలో మాత్రం 9 కిలోల 200 గ్రాముల మాంసాన్ని తింటున్నారని ప్రభుత్వ సంస్థల సర్వేలో వెల్లడైంది. మాంసం తినడంలో తెలంగాణ టాప్‌‌‌‌లో ఉండగా, తర్వాతి స్థానంలో ఏపీ ఉంది. హైదరాబాద్‌లో అయితే కేవలం 10 శాతం మంది శాఖాహారులు ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

భారతీయుల ఆహారంపై అనేక సూత్రీకరణలు, అపోహలు ఉండగా భారతదేశం ప్రధానంగా శాకాహార దేశం అన్నది వాటిలో ఒక ప్రధాన సూత్రీకరణ. అయితే మారుతున్న కాలాన్ని బట్టి మాంసాహారులు ఎక్కువగా అయ్యారని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మాంసం వినియోగంలో ఇండియా వెనకబడే ఉంది. 2.9 కిలోల తలసరి వినియోగంతో 42వ స్థానంలో ఉండగా.. అమెరికా 95.43 కిలోల తలసరి వినియోగంతో మొదటి స్థానంలో ఉంది. బ్రెజిల్‌‌‌‌, రష్యా, చైనా, సౌతాఫ్రికా తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి.

ఇక భారత్‌లో మహిళలే ఎక్కువగా మాంసం తినట్లేదట. పురుషులు, మహిళల ఆహారపు అలవాట్ల గురించి చర్చించిన పరిశోధకులు పురుషులకన్నా మహిళల్లో ఎక్కువ మంది శాకాహారులు ఉన్నట్లు గుర్తించారు. శాకాహార సాంప్రదాయాన్ని ఎక్కువగా మహిళలు పాటిస్తున్నారని వెల్లడించారు పరిశోధకులు. ఈ విషయం సర్వేలో వెల్లడైంది.