సమ్మెకు సై.. అర్ధరాత్రి నుంచి ఆగనున్న బస్సులు

27

ముందు చెప్పినట్టుగానే తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఈ అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిచిపోనున్నాయి. ఐఏఎస్ కమిటీతో ఆర్మీసీ కార్మిక సంఘాల చర్చలు విఫలమయ్యాయి. కార్మిక సంఘాల నేతలు చర్చల మధ్యలోనే బయటకు వచ్చేశారు. రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె జరుగుతుందని కార్మిక సంఘ నేత అశ్వద్దామ రెడ్డి చెప్పారు.

ఆర్టీసీని బతికించడానికి జరుగుతున్న ఈ పోరాటానికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు. తాము ఎవరిచేతుల్లో కీలు బొమ్మలం కాదని, ఎస్మాకు, పీడీయాక్ట్ కు భయపడేది లేదని తేల్చిచెప్పారు. ఇక ఆర్టీసీ సమ్మె సైరన్‌ ను క్యాష్‌ చేసుకుంటున్నాయి ప్రైవేట్‌ ట్రావెల్స్‌. ప్రయాణికులకు గత్యంతరం లేక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ లో వెళ్లాల్సి వస్తోంది. దీంతో అడ్డగోలు ఛార్జీలతో దారి దోపిడి చేస్తున్నాయి.

విజయవాడకు వెయ్యి నుంచి విశాఖపట్నానికి 3 వేలు, అదిలాబాద్‌, నిజామాబాద్‌కు 15 వందలపైనే వసూలు చేస్తున్నారు ప్రైవేటు ఆపరేటర్లు. టికెట్‌ బుకింగ్‌ యాప్‌లోనూ ప్రయాణికులను మోసం చేస్తున్నాయి ట్రావెల్స్‌. విజయవాడ టికెట్‌ 500 రూపాయలు అని ఉంటుంది. క్లిక్‌ చేసి.. టికెట్‌ బుక్‌ చేసే టైంలో 2 వేల రూపాయలు చూపిస్తోంది. వరుస సెలవులు దొరికాయి కదా అని పండగకు ఊరెళ్దామనుకుంటే నెల జీతమంతా టికెట్లకే పోతుంది అంటున్నారు ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు.