రిలీజ్ డేట్ల వెనక తెలుగు నిర్మాతల పరుగు…
Timeline

రిలీజ్ డేట్ల వెనక తెలుగు నిర్మాతల పరుగు…

యావత్ ప్రపంచాన్ని సంవత్సర కాలంగా వణికిస్తుంది కరోనా వైరస్. ప్రపంచ వ్యాప్తంగా లాక్‏డౌన్ విధించి అటు ఆర్థికంగా నష్టపోయేలా చేసింది. దీంట్లో ముఖ్యంగా దెబ్బ తిన్నది సినిమా ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఒక్క సరిగా లాక్ డౌన్ రావడంతో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాలు ఆగిపోయాయి. షూటింగులు ఆపేసారు. ఇంకా షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లని ప్రాజెక్టులు ఎన్నో. ఎంతో మంది నిర్మాతలు ఎక్కడెక్కడో డబ్బులు పోగేసుకొని సినిమాలు తీయడానికి ఇండస్ట్రీకి వచ్చిన వారికి గత సంవత్సరం మర్చిపోలేని గాయం అనే చెప్పుకోవాలి.

మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, ప్రభాస్, విజయ్ దేవరకొండ, కార్తికేయ ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా అందరి హీరోల సినిమాలు ఆగిపోయాయి. వాళ్ల సినిమాల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నిర్మాతలు, ఆ సినిమా రిలీజ్ ల మీద ఆశలు పెట్టుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఒక్కసారిగా కుప్పకూలారు.

అయితే కరోనా కేసులు తగ్గడంతో దేశంలో సినిమా షూటింగులు చేసుకోవచ్చని, 50 శాతం ఆక్యుపెన్సీ తో సినిమాలు థియేటర్లలో రిలీజ్ చేసుకోవచ్చని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇది ఒక రకంగా సినీ ఇండస్ట్రీకి ఊరటనిచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమా షూటింగులు మొదలు పెట్టారు మన హీరోలు.. నిర్మాతలు. గత సంవత్సరం కొత్త ప్రాజెక్టులు చేద్దామనుకున్న వారు ఆ ప్రాజెక్టులను ఇప్పుడు తెరపైకి తీసుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. గత సంవత్సరం రిలీజ్ కు అనౌన్స్ చేయబడ్డ సినిమాలు షూటింగులు జరుపుకొని ఈ సంవత్సరం సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేసుకుంటున్నాయి.

అయితే సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య ఎప్పుడూ రిలీజ్ డేట్ ల విషయంలో విభేదాలు వస్తూనే ఉండేవి గతంలో. ఇప్పుడు కూడా అదే వివాదం మరొకసారి తెరపైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రాజమౌళి RRR అక్టోబర్ 13న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉందని వారు ప్రకటించారు. అయితే రాజమౌళికి ఉన్న డిమాండ్ కారణంగా అటు బాలీవుడ్ లో ఉన్న నిర్మాతలు కూడా ఆ సమయానికి సినిమా రిలీజ్ చేయడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా అజయ్ దేవగన్ నటిస్తున్న ఒక హిందీ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఆయన రాజమౌళికి తమ డేట్ ను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే అదే సమయానికి ఆయన కూడా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సంగతి ఇలా పక్కనబెడితే గతంలో ఒక నెల ముందుగా సినిమా డేట్ లను ప్రకటించేవారు. కానీ ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్లకు రావడమే ఒక పెద్ద సవాల్ గా మారబోతుంది అని, ఒకవేళ వచ్చినా మొదటి రెండు మూడు రోజుల్లోనే ఎక్కువమంది వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో నిర్మాతలు ఎప్పుడో సంవత్సరం తర్వాత రిలీజ్ చేయవలసిన సినిమాల డేట్ లని కూడా ముందే లాక్ చేసేసి ఇప్పుడు ప్రకటిస్తున్నారు. ఇలా రిలీజ్ డేట్ ల వెనక సినీ నిర్మాతల పరుగు ఇప్పుడు అప్పుడే ఆగేలా లేదు. రిలీజ్ డేట్లపైనే ఆధారపడి డిస్ట్రిబ్యూటర్లు తమ బిజినెస్ ప్లాం చేసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published.