‘తెలుగు సర్కిల్స్’ కి గూగుల్ ఆర్థిక సహాయం

కరోనా ప్రపంచంపై పంజా విసిరినప్పటినుండి ఎన్నో జీవితాలు మధ్యలోనే ముగిసిపోయాయి. లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కి పరిమితమైపోయారు ఉద్యోగులు. చాలా కుటుంబాలపై దీని ప్రభావం గట్టిగానే ఉంది అన్న విషయం మనం చదువుతున్న వార్తలతో తెలుస్తూనే ఉంది.

అయితే ఈ కరోనా జర్నలిజం పై కూడా తన ప్రతాపం చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో న్యూస్ సంస్థలు వారి ఉద్యోగుల జీతాలు కట్ చేసారు. మరి కొందరు జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది.

అందుకోసమే ప్రజలకు పనికొచ్చే వార్తలు ప్రచురించే చిన్న సంస్థలను ఆదుకోవడానికి గూగుల్, ఫేస్ బుక్, అమెజాన్ లాంటి సంస్థలు అత్యవసర ఆర్ధిక సహాయం అందించడం కోసం ఫండ్స్ ని ఏర్పాటు చేసాయి. అందులో భాగంగానే గూగుల్ తమ గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్ నుండి జర్నలిజం ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్ ని ప్రకటించింది.

దీని కోసం అప్లై చేసుకున్న 100 దేశాల నుండి 12000 అభ్యర్ధనల్లో మొదటి జాబితాలో సెలెక్ట్ చేసిన వారికి 5 వేల అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. అయితే తెలుగు సర్కిల్స్ కూడా దీనికి సెలెక్ట్ అవ్వడం అనేది గొప్ప విషయం అంతే కాకుండా ఆనందించాల్సిన విషయం.

ఎందుకంటె క్లిక్కులకోసమే వార్తలు రాసే పెద్ద పెద్ద మీడియా సంస్థలను పక్కన పెట్టి అతి తక్కువ టైం లోనే ప్రజల గౌరవాన్ని పొందిన తెలుగు సర్కిల్స్ లాంటి చిన్న మీడియాను మీతో పాటు, గూగుల్ లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ గుర్తించి, మా సేవలు కరోనా కారణంగా ఆగిపోకూడదు అని ఆర్థిక సహాయం తో ఆదుకోవడం అంటే మామూలు విషయం కాదు.

గూగుల్ జర్నలిజం ఎమర్జెన్సీ రిలీఫ్ ఫండ్ కి సెలెక్ట్ అయినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం అంతే కాకుండా ఇది ఒక బాధ్యతగా తీసుకొని భవిష్యత్తులో ప్రజల జీవితాలను మార్చే న్యూస్ రాస్తామని హామీ ఇస్తూ , మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మా రీడర్స్ అందరికి కృతఙ్ఞతలు.