ఢిల్లీలో హై అలర్ట్‌

4

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పాక్‌ ప్రేరేపిత జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు ప్రవేశించారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. రానున్న పండగల సందర్భంగా దాడులు జరిపేందుకే వారు భారత్‌లో ప్రవేశించారన్న వార్తలు వెలువడుతున్నాయి.

దీంతో ఉత్తర భారత దేశంలోని విమానాశ్రయాలను అప్రమత్తం చేసి, భద్రతను పెంచినట్లు అధికారులు తెలిపారు. రాజధాని నగరంలోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్లు ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగానికి బుధవారం సాయంత్రం సమాచారమందిందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. ఈ సమాచారంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు సాయుధులైన ఉగ్రవాదుల కోసం గాలింపుచర్యలు ప్రారంభించారు. ఉగ్రవాదుల నుండి పొంచి ఉన్న ముప్పుపై గురువారం ఉదయం ప్రధాని మోడీ నివాసంలో అధికారులు సమావేశమై చర్చించారు.

ఈ విషయమై తాము అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని, అందిన సమాచారం మొత్తాన్ని ఓడీకరించి దార్యప్తు చేస్తున్నామని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సెంట్రల్‌ ఢిల్లీ డిప్యూటి పోలీసు కమిషనర్‌ ఎంఎస్‌ రాన్‌ధావ తెలిపారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశమున్నదని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తాము అప్రమత్తమైనట్లు ఆయన చెప్పారు. దాదాపు 30 ప్రధాన నగరాలను ప్రమత్తం చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.