భారత్ గుర్తించిన ఉగ్రవాద జాబితాకు.. అమెరికా సంపూర్ణ మద్దతు

భారత్‌కు మోస్ట్ వాంటెడ్ అయిన కరుడుగట్టిన ఉగ్రవాదులైన దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్, జకీవుర్ రెహ్మాన్ లక్వీ, మసూద్‌లను కొత్త ఉగ్రవాద వ్యతిరేక చట్టం ప్రకారం భారత ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్, లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ ముహమ్మద్ సయీద్‌లను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) సవరణ చట్టం 1967 ప్రకారం వ్యక్తిగత ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది.

యూఏపీఏ చట్ట సవరణ ప్రకారం వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించొచ్చు. గతంలో ఏవైనా గ్రూపులు, సంస్థలను మాత్రమే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. ఇప్పుడు యూఏపీఏ చట్టానికి సవరణలు చేయడంతో వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే అవకాశం దక్కింది. మౌలానా మసూద్ అజర్ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాడని, కాబట్టి అతడిని ఈ చట్టం కింద ఉగ్రవాదిగా పేర్కొన్నట్టు హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, హఫీజ్ ముహమ్మద్ సయీద్ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని, అందుకే అతడిని కూడా ఈ చట్టం కింద ఉగ్రవాదిగా ప్రకటించినట్టు కేంద్రం వివరించింది.

మరోవైపు, కొత్త యూఏపీఏ చ‌ట్టం ప్ర‌కారం మ‌సూద్ అజ‌ర్‌, హ‌ఫీజ్ స‌యీద్‌, దావూద్ ఇబ్ర‌హీం, జ‌కీర్ ఉర్ ర‌హ్మాన్ ల‌ఖ్వీల‌ను ఉగ్ర‌వాదులుగా ప్రకటిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భార‌త ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న‌ను అమెరికా స్వాగ‌తించింది. భార‌త నిర్ణ‌యాన్ని మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు యాక్టింగ్ అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ ఫ‌ర్ సౌత్ అండ్ సెంట్ర‌ల్ ఆసియా అధిప‌తి అలిస్ వెల్స్ ట్వీట్ చేశారు.