అమెరికాలో అల్ల కల్లోలం.. క్యాపిటల్ భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితులు

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయాన్ని ఆ దేశ కాంగ్రెస్ అధికారికంగా ధ్రువీకరించేందుకు సమావేశమైన క్రమంలో.. క్యాపిటల్ భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు చేపట్టిన నిరసన హింసకు దారితీసింది. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపగా.. ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

అమెరికా అధ్యక్ష పదవి నుంచి డొనాల్డ్ ట్రంప్ మరో రెండు వారాల్లో వైదొలగనున్న తరుణంలో వాషింగ్టన్లో ఆయన మద్దతుదారులు భారీ ఆందోళన చేపట్టారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికను అధికారికంగా ధ్రువీకరించేందుకు అమెరికన్ కాంగ్రెస్ భేటీ అయింది. అయితే.. ఈ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనం వద్ద చేపట్టిన నిరసన హింసకు దారితీసింది. వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఘర్షణకు దిగారు నిరసనకారులు. బారికేడ్లను నెట్టివేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు.. తొలుత పెప్పర్ స్ప్రేలను ప్రయోగించారు.