పవన్ కళ్యాణ్ ను కలిసిన హనుమంత రావు.. ఆ సమస్యని పవన్ బలంగా తీసుకెళ్తాడు: వీహెచ్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లిన వీహెచ్ యురేనియం తవ్వకాల అంశంపై పవన్ తో మాట్లాడారు.

అనంతరం ఇరువురూ మీడియా సమావేశంలో మాట్లాడారు. తొలుత పవన్ మాట్లాడుతూ.. నల్లమల అటవీ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు పర్యావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా పులుల సంరక్షణకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.

దీనిపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామని, రెండుమూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాల పర్యవసానాలపై మేధావుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకుంటామని పవన్ వెల్లడించారు.

అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి సామాజిక సమస్యలపై స్పందించడంలో పవన్ కల్యాణ్ ముందుంటాడని, ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లగలడని కితాబిచ్చారు. అందుకే తాను పవన్ ను కలిశానని వివరించారు. నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల అటవీప్రాంతం దెబ్బతింటుందని, వన్యప్రాణులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు.

నల్లమలలో యురేనియం తవ్వితే, అక్కడి జలాలు కృష్ణా నదిలో కలుస్తాయని, ఆ నీటిని తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ.. ఏపీలో కృష్ణా, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతాల వాళ్లు తాగుతారని, తద్వారా అనారోగ్యం బారిన పడతారని తెలిపారు.