ఇక జనసేన రంగులో వంగవీటి రాధాకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలు అయ్యాక కూడా ఇలాంటి పరిణామాలు కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని జనంతో పాటు నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన వంగవీటి రాధాకృష్ణ హఠాత్తుగా ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు.

అంతకంటే ముందు రాధాకృష్ణ జనసేన పార్టీ సమావేశాలు జరుగుతున్న తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్‌‌‌‌‌కు వెళ్లారు. అక్కడ జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో చర్చలు జరిపారు.

ఈరోజు రాజమండ్రిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తో భేటీ అయ్యారు వంగవీటి రాధా. ఇటీవల రాధా వైసీపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే రాధాకృష్ణ కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన టీడీపీ జనరల్ బాడీ సమావేశానికి కూడా ఆయన రాలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇప్పుడు జనసేనానితో రాధా భేటీ కావడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. రాధా, పవన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారా.. లేక జనసేనలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారా అనేది ఆసక్తిగా మారింది. మరోవైపు వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.