స్వామీజీతో రాసలీలలు.. భర్తను చంపిన భార్య

61

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి చంపేసిందో ఇల్లాలు. ఉపాధి కోసం భర్త విదేశాల్లో కష్టపడుతుంటే ఇక్కడేమో స్వామీజీతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విదేశాల నుంచి భర్త తిరిగి రావడంతో తమ బంధానికి అడ్డు పడతాడేమోనని ఇద్దరూ కలిసి చంపేశారు.

తమిళనాడులోని శివగంగై జిల్లా కారైక్కుడి పెరియార్‌నగర్‌లో నివాసముండే మణిముత్తు(51)కు భార్య భూమతి, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడున్నారు. చాలాకాలంగా ఉపాధి నిమిత్తం విదేశాల్లోనే ఉన్న మణిముత్తు ఇటీవలే ఇంటికి వచ్చాడు. ఆదివారం రాత్రి భార్య, కుమార్తెలతో కలిసి మేడపై పడుకున్న అతడు సోమవారం ఉదయం మెడపై గాయాలతో చనిపోయి కనిపించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించారు. అతడి భార్య భూమతిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం చెప్పింది.

మణిముత్తు స్వగ్రామం కారైక్కుడి సమీపంలోని కానాడుకాత్తాన్‌. 15 సంవత్సరాల క్రితం అతడికి వేల్‌మురుగన్ అనే స్వామీజీతో పరిచయం ఏర్పడింది. దీంతో ఆయన్ని అప్పుడప్పుడు ఇంటికి తీసుకొచ్చి పూజలు చేయిస్తుండేవాడు. స్వామీజీని తన భార్య భూమతికి కూడా పరిచయం చేశాడు. కొద్ది నెలల తర్వాత మణిముత్తు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాడు. అయినప్పటికీ వేల్‌మురుగన్ అప్పుడప్పుడూ వారింటికి వెళ్తూ భూమతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొద్ది నెలల క్రితం విదేశాల నుంచి వచ్చిన మణిముత్తుకు భార్య వ్యవహారం తెలియడంతో మందలించాడు. గ్రామంలోనే ఉంటే పరువు పోతుందని భావించి కానాడుకాత్తాన్‌ నుంచి కారైక్కుడికి మకాం మార్చాడు.

అయితే తన అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్న భర్తను చంపేయాలని భూమతి నిర్ణయించుకుంది. ప్రియుడు వేల్‌మురుగన్‌తో కలిసి ప్లాన్ వేసింది. దీని ప్రకారమే ఆదివారం రాత్రి భర్త మేడపై పడుకునేలా చేసింది. అర్ధరాత్రి సమయంలో శవాలను దహనం చేసే కార్మికుడైన ప్రకాశ్‌కుమార్‌తో కలిసి వేల్‌మురుగన్ రామేశ్వరం నుంచి కారైక్కుడికి కారులో చేరుకున్నాడు. భూమతి ఇంటి తలుపులు తీసే పెట్టడంతో నేరుగా మేడపైకి చేరుకున్నాడు. అక్కడ వారిద్దరితో కలిసి భూమతి భర్త గొంతు నులిమి చంపేసింది. నేరం అంగీకరించడంతో పోలీసులు భూమతి, వేల్‌మురుగన్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రకాశ్‌కుమార్ కోసం గాలిస్తున్నారు.