Breaking News :

కెసిఆర్ – జగన్ దోస్తీకి బ్రేక్?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డిల మధ్య మైత్రికి విఘాతం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వీరి మైత్రి ఫెవికల్ లాగా అత్తుకుపోయింది. వీరి విడదీయడం చాలా కష్టమని, తెలుగు ప్రజల సంక్షేమానికి ఈ మైత్రి అవసరమని రాజకీయ విశ్లేషకులు కథనాలు రాశారు. కానీ తెలంగాణ రాప్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పుణ్యమా అని ఈ ఇద్దరి మైత్రికి బీటలు పారనున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలే కారణం కానున్నది. కేబినెట్ సమావేశంలో జగన్ ఆర్టీసీ కార్మికులపై చూపిన ప్రేమ కేసీఆర్ కు ముప్పుగా మారింది. ఎలాంటి అనుభవం లేని జగన్ దూకుడు నిర్ణయాలతో ప్రజా రవాణా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటే అపార అనుభవమున్న తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు ఆర్టీసీని ప్రైవేటు పరం చేేసేందుకు ప్రయత్నిస్తున్నారని కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి రూ.1000కోట్లతో 3677 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. అంతేకాకుండా ప్రజా రవాణా వ్యవస్థను కాపాడేందుకు తమ ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. జగన్ తొలి కేబినెట్ లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు ఐఆర్ 27శాతం పెంచారు. విలీనం ప్రక్రియలో కొన్ని సాంకేతిక కారణాలున్నాయని, వాటిని పరిష్కరించిన సరైనా సమయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీంతో తెలంగాణలో అప్పటికే 12రోజులుగా సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు అగ్గిలో మంట వేసినట్లయింది. పైగా ఆదే రోజు తెలంగాణ ప్రభుత్వం 1035 అద్దె బస్సులకు నోటిఫికేషన్ జారీ చేసింది. సమ్మె చేస్తున్న కార్మికులను పట్టించుకోకుండా కేసీఆర్ సర్కార్ అద్దె బస్సులను తీసుకొని ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికీ 14 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ చర్చలకు తావు లేదు అన్న రీతిలో కేసీఆర్ ప్రకటనలు చేస్తున్నారు. ఈ వైఖరీతో కార్మికులు సమ్మెను మరింత వేగం పెంచేందుకు పూనుకున్నారు.

ఇదిలా ఉండగా జగన్ ఆర్టీసీపై చూపిన ప్రేమను కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిసింది. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కేసీఆర్ సలహాలు, సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ లో పాలన సాగిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంట్లో భాగంగానే జగన్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కేసీఆర్ ను కలిసి కష్టసుఖాలు మాట్లాడుకోవడం పరిపాటిగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని మీడియాలో కూడా పలు కథనాలు వచ్చాయి. కానీ జగన్ కెబినెట్ లో తీసుకున్న నిర్ణయంతో కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్లు సమాచారం. అసలే ఆర్టీసీ కార్మికులు దారికి రావడం లేదు. రాష్ట్రంలో పలు ఉద్యోగ సంఘాలు మద్ధతు ఇస్తున్నాయి. వీటితో కంట్రోల్ చేయలేక ఇబ్బందులు పడుతున్న కేసీఆర్ కు జగన్ నిర్ణయం తలనొప్పిగా మారింది. పైగా జగన్ కు తాను సహకరిస్తున్నప్పటికీ తనను ఇరకాటంలో పెట్టే నిర్ణయం తీసుకోవడంతో కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నట్లు సమాచారం. ఇక నుంచి జగన్, కేసీఆర్ ల మైత్రి ఏ మేరకు కొనసాగనున్నదో తేలాల్సిందే.

Read Previous

ఆర్టీసీ సమ్మె: అశ్వత్థామరెడ్డి అరెస్ట్

Read Next

జ‌న‌సేన పొలిట్ బ్యూరో సమావేశం