వాహన మిత్ర ప్రారంభం

12

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సీఆర్‌రెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌కు హెలికాప్టర్‌ ద్వారా అక్కడకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని, ఆస్పత్రి ఆవరణలో వైద్య కళాశాలకు ఫౌండేషన్‌ స్టోన్‌ వేస్తారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ పరిశీలిస్తారు. ఆ తర్వాత వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మంజూరు పత్రాలు అందించి లబ్ధిదారులతో మాట్లాడతారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఉచితంగా అందిస్తారు. వాహన బీమా, ఫిట్‌నెస్, మరమ్మతులకు వాహన మిత్ర డబ్బులు ఉపయోగపడనున్నాయి. వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను సెప్టెంబర్ 9న విడుదల చేసింది. వాహన మిత్ర పథకం కోసం బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో రూ.68 కోట్లు ఎస్సీలకు, రూ. 20 కోట్లు ఎస్టీలకు, ఇతర కులాలకు రూ.312 కోట్లు కేటాయించారు. పాదయాత్రలో గతేడాది మే 14న ఏలూరులో జరిగిన బహిరంగ సభలో జగన్ వాహనమిత్ర హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 4 నెలలకే వాహన మిత్ర పథకాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారు.