పేదలందరికీ ఇళ్ల పథకం కోసం రూ.935 కోట్ల విడుదలకు ఏపీ ప్రభుత్వం

పేదలందరికీ ఇళ్ల పథకం కోసం రూ.935 కోట్ల విడుదలకు ఏపీ ప్రభుత్వం పాలనా అనుమతిచ్చింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం కొనుగోలు చేసిన భూమికి పరిహారం చెల్లింపుగా ఈ నిధులను రెవెన్యూ శాఖ విడుదల చేయగా.. సీసీఎల్‌ఏ ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్లు ఈ నిధులు వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 25 నుంచి రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 8,914 ఇళ్లు చొప్పున పనులు ప్రారంభించనున్నారు. 8,838 కొత్త లే అవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతారు. టిడ్కో ఇళ్లలో 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లపై సీఎం ప్రకటించిన తాజా రాయితీల ప్రకారం అదనంగా రూ.482 కోట్ల ఖర్చును ప్రభుత్వం భరించనుంది. 300 చదరపు అడుగుల ఫ్లాట్‌లను కేవలం ఒక రూపాయికే ప్రభుత్వం అందించనుంది.