వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయండి
Timeline

వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయండి


కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి శ్రీ వి.విజయసాయి రెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన వైద్య కళాశాలలకు అవసరమైనంత ఆర్థిక సాయం అందించవలసిందిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీ వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంత్రికి లేఖ రాశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించడంతోపాటు కొత్తగా మరో 13 వైద్య కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించినట్లు విజయసాయి రెడ్డి తన లేఖలో మంత్రికి వివరించారు. పాత వైద్య కళాశాలల అభివృద్ధి, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు కోసం సుమారు 13,500 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం అవసరమని వివరించారు.

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో టైర్‌ 2, టైర్‌ 3 నగరాలు మాత్రమే మిగిలాయి. టైర్‌ 1 నగరాలు లేనందున సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి ప్రైవేట్‌ వైద్య రంగం ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో వైద్య సేవల రంగాన్ని త్వరితగతిన పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని విజయసాయి రెడ్డి ఆ లేఖలో వివరించారు.

తమిళనాడు, తెలంగాణ రాష్ట్రలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల సంఖ్య చాలా తక్కువ. అయితే ఆయా రాష్ట్రాలలోని జిల్లాలతో పోల్చుకుంటే భౌగోళికంగా, జనాభాపరంగా ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలు సగటున మూడు రెట్లు పెద్దవి. ఈ కారణంగా వైద్య సేవల రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్రం జిల్లాల వారీగా అమలు చేస్తున్న పథకం కింద తగినంత ఆర్థిక సాయం పొందడంలో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం వాటిల్లుతోందని అన్నారు.

ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గత ఆగస్టు 17న ప్రధానమంత్రికి రాసిన లేఖలో సోదాహరణంగా వివరించారు. అలాగే గత ఆగస్టు 11న ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం శ్రీ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకువచ్చి ప్రభుత్వ వైద్య సేవల రంగాన్ని పటిష్టపరిచేందుకు తగిన ఆర్థిక సాయం అందేలా చూడాలని కోరారు. ఆరోగ్య రంగంలో జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని సామాన్య ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. కాబట్టి రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు తగినంతగా ఆర్థిక సాయం అందించి తోడ్పడాలని విజయసాయి రెడ్డి తన లేఖలో మంత్రిని కోరారు.